MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 1:49 pm Posted by : MANA TOLIVELUGU

ఆర్టీసీ రాయితీ మాయాజాలం

జర్నలిస్టుల జేబులకు చిల్లు.. !

1/3 రాయితీకి మంగళం.. సగం ధరకంటే ఎక్కువే వసూలు

ఎక్స్‌ప్రెస్‌లో 55శాతం, ఎలక్ట్రిక్ బస్సుల్లో 60శాతం బాదుడు

బస్సు పాస్‌లో ఒకటి.. టికెట్ మిషన్‌లో మరొకటి..!

సాఫ్ట్‌వేర్ సాకుతో అదనపు వసూళ్లు

బెంబేలెత్తుతున్న విలేకరులు

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ రమేష్ :

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకి ఆర్టీసీ షాక్ ఇస్తోంది. జర్నలిస్టులకు ఇచ్చే ప్రయాణ రాయితీల్లో నిశ్శబ్దంగా కోత విధిస్తూ, వారిపై అదనపు భారాలు మోపుతోంది. గతంలో అమలైన 1/3 (మూడో వంతు) రాయితీని కాగితాలకే పరిమితం చేస్తూ, క్షేత్రస్థాయిలో సగం కంటే ఎక్కువ ధరను వసూలు చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ అక్రిడిటేషన్ నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు టికెట్ ధరలో కేవలం 33 నుండి 35 శాతం మాత్రమే వసూలు చేయాలి. కానీ, ప్రస్తుతం ఆర్టీసీ దాదాపు 50 శాతం (1/2 ధర) కంటే ఎక్కువే వసూలు చేస్తోంది. బస్సు పాస్‌ల మీద స్పష్టంగా 1/3 రాయితీ అని ముద్రిస్తున్న అధికారులు, టికెట్ ఇష్యూయింగ్ మిషన్లలో (టిమ్స్) మాత్రం ఆ మేరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడమే ఈ దోపిడీకి కారణమని తెలుస్తోంది.

ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల్లో చుక్కలు..!

సాధారణ పల్లె వెలుగు బస్సుల కంటే ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ సర్వీసుల్లో జర్నలిస్టులకు రాయితీ భారం భారంగా మారింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వీటిలో జర్నలిస్టుల నుంచి ఏకంగా 53 శాతం నుండి 55 శాతం వరకు టికెట్ ధర వసూలు చేస్తున్నారు. అంటే రాయితీ 50 శాతం కూడా ఉండటం లేదు. ఎలక్ట్రిక్ బస్సుల్లో పర్యావరణ హితం పేరిట వచ్చిన ఈ బస్సుల్లో జర్నలిస్టులకు అసలైన షాక్ తగులుతోంది. ఇక్కడ ఏకంగా 60 శాతం ధర వసూలు చేస్తూ, కేవలం 40 శాతం రాయితీతోనే సరిపెడుతున్నారు.

కండక్టర్లతో వాగ్వివాదాలు.. మిషన్లదే తప్పు..!

బస్సుల్లో రాయితీపై కండక్టర్లను ప్రశ్నిస్తే.. మేమేం చేయలేం.. మిషన్లలో (టిమ్స్) ఫీడింగ్ ఎలా ఉంటే అలాగే టికెట్ వస్తుందని వారు చేతులెత్తేస్తున్నారు. రాయితీ లెక్కల్లో స్పష్టత లేకపోవడంతో నిరంతరం జర్నలిస్టులకు, కండక్టర్లకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దూరాన్ని బట్టి లెక్కించాల్సిన రాయితీలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తల సేకరణ కోసం జిల్లా కేంద్రాలకు, ఇతర పట్టణాలకు నిరంతరం ప్రయాణించే విలేకరులకు ఈ టికెట్ భారం గుదిబండగా మారింది. అతి తక్కువ జీతాలతో పని చేసే జర్నలిస్టులు, తమ సంపాదనలో ఎక్కువ భాగం ప్రయాణాలకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి  – టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించిజర్నలిస్ట్ లందరికి ఉచిత బస్ సౌకర్యం అన్ని రకాల బస్సుల్లో కలిపించాలని (ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ సహా) టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదా పాత పద్ధతిలో మూడోవంతు రాయితీని పక్కాగా అమలు చేయాలని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూజర్ చార్జీల నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని, టికెట్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ లోపాలను సరిదిద్దాలని కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఈ రాయితీ కోతకు అడ్డుకట్ట వేయాలని జర్నలిస్టులు కోరుతున్నారు.